Non creamy layer orders

బి.సీ.లు - ఓబీసీ(నాన్ -క్రిమిలేయర్ ) వివరాలు

        వెనుకబడిన తరగతులకు (OBC ) మన రాష్ట్రస్థాయిలో (పూర్వపు AP) రిజర్వేషన్ సౌకర్యమును (25%) 1970వ సం॥లో జీ.ఓ.యం.యస్ . నెం . 1793 ద్వారా , కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు (27%) 1993 వ సం ॥ నుండి మాత్రమే కల్పించబడినది . 
కానీ , ఈ ( OBC ) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించింది . 
సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని వేయడం జరిగినది . ఆ కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ ( సంపన్నశ్రేణి ) ను గుర్తించడం జరుగుతుంది . 

 సంపన్నశ్రేణీ క్రీమీలేయర్ ) అనగానేమి ? 

        వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని ' సంపన్నశ్రేణి ' ( క్రీమీలేయర్ ) గా పరిగణిస్తారు . 

    సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ , వారు సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందినవారైనందున రిజర్వేషన్ సౌకర్యమును పొందుటకు అనర్హులు . వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది . 

       కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చేయబడిన సూచనల ప్రకారం వెనుకబడిన తరగతులలోని సంపన్నశ్రేణిని ఈ క్రింద తెలియజేయబడిన విధంగా గుర్తిస్తారు . 

1. రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్టులలో ఉన్నవారి పిల్లలు :

         i ) రాష్ట్రపతి ii ) ఉపరాష్ట్రపతి iii ) సుప్రీంకోర్టు , హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు iv ) UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు ) v ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ( CEC ) vii ) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( CAG ) vii ) అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ viii ) అధికార భాషా సంఘ సభ్యులు ix ) కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు , MP , MLA & MLC లు , ఎగువ చట్టసభల ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లు x) రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు .

    II . సివిల్ ఉద్యోగులు :

      1. తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో ( IAS , IPS & IFS ) డైరెక్టుగా నియామకం పొందినవారు . 

    2. తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు .

     3. తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు . 

     4. తల్లిండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి , 40 సం॥ల లోపు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు . 
(40 సం || ల తర్వాత గ్రూప్ -1 స్థాయికి ప్రమోషన్ పొందినట్లైతే వారి పిల్లలు క్రీమీలేయర్ కింద రారు. )

తల్లిదండ్రులిద్దరు లేదా ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ -4 స్థాయిలో తొలుత నియామకం పొంది వారు ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా గానీ వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్నశ్రేణిగా పరిగణించబడరు . 

       సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి కిందకు వస్తారా ? రారా ? అన్న విషయం నిర్ణయించబడుతుంది . అంతేకానీ , వారు ప్రస్తుతం పొందు జీతభత్యములను బట్టి మాత్రం కాదు.
        ఇచ్చట గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన అంశమేమంటే , ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే . 
ప్రైవేటు సంస్థలలో పనిచేయు ఉద్యోగులు ఈ కేటగిరీ క్రిందకు రారు .

    III . మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు :

 మిలిటరీ ( Army , Navy & Air Force ) మరియు పారా మిలిటరీ పనిచేయుచున్న తల్లిదండ్రులలో ఏ ' ఒక్కరు గానీ లేక ఇద్దరూ ' కల్నల్ ' స్థాయి ఉద్యోగంలో యున్న యెడల వారి పిల్లలు సంపన్నశ్రేణిగా . గుర్తించబడతారు . 
ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్నశ్రేణి వర్తించదు .

     IV . ప్రొఫెషనల్స్ , వాణిజ్య మరియు వ్యాపార వర్గాలు :

   ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , చార్టర్డ్ అకౌంటెంట్లు , ఇన్కంటాక్స్ కన్సల్టెంట్లు , ఆర్కిటెక్టులు , కంప్యూటర్ ప్రొఫెషనల్స్ , సినీ ఆర్టిస్టులు , రచయితలు , జర్నలిస్టులు , క్రీడాకారులు మొదలగువారు . వారి ఆదాయాన్ని బట్టి సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు . అనగా , మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు ' సంపన్నశ్రేణి'గా గుర్తించబడతారు . ప్రస్తుతం కేంధ్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన వార్షికాదాయ పరిమితి రూ .8.00 లక్షలు .

  V. ఆస్తిపరులు : 
   ఎ ) వ్యవసాయ భూమి : 

i ) సాగునీటి సౌకర్యం కలిగి , Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 85 % భూమి ఉన్న యెడల , వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .

 ii ) ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది , కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల , సాగునీటి సౌకర్యం గల భూమి Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 40 % కంటే ఎక్కువగా ఉన్నప్పుడే , మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి , రెంటినీ కలిపి చూసి , Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 80 % కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు .

iii ) ఒకవేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు , ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడరు .

     భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్నశ్రేణి నిర్ణయిస్తారు . ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయంతో ఏ మాత్రం సంబంధం లేదు . 

ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి , ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయం సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ , అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించరాదు . 

బి ) ) మామిడి , బత్తాయి , నిమ్మ మొ || తోటలు : 

ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో , వీటిని మామూలు సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది . అంటే , 
Land Ceiling Act ప్రకారం 85 % కంటే ఎక్కువగా భూమిని కలిగి , ఆ భూమిలో పైన తెలిపిన తోటలు ఉన్న యెడల , అట్టివారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించబడటం జరుగుతుంది . 

ii ) కాఫీ , టీ , రబ్బరు మొ.. తోటలు 
ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో , వాటిపై వచ్చు ఆదాయమును క్రీమీలేయర్ నిర్ణయం జరుగుతుంది . అనగా , పైన తెలియజేయబడిన విధముగా నిర్దేశించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయమును మూడు సం॥లు వరుసగా పొందిన యెడల , అట్టివారి పిల్లలు క్రీమీలేయర్ పరిగణించబడతారు . 

సి ) పట్టణాలలో ఖాళీ స్థలం / భవనములు : Wealth Tax వర్తింపజేయబడి , పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడతారు . 

 క్రీమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని వివరణలు : 

1 ) క్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు , విద్యాసంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపజేయాలి . 

2 ) ఉద్యోగుల విషయంలో క్రీమీలేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు . వారు పొందు జీతభత్యాలతో ఏ మాత్రం సంబంధం లేదు .

    3 ) ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు . అట్టి పరిస్థితులలో వారు క్రీమీలేయరు క్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి . ఒకవేళ , వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి క్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి క్రీమీలేయరు క్రిందకు రావచ్చు . వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యంగానీ , ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు .ఏదైనా ఒక దానిలో మాత్రమే చూడాలి. 
     అంతే కానీ జీతభత్యాలను మరియు వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి క్రీమీలేయర్ ని నిర్ణయించరాదు .

4 ) జీతభత్యాలు , వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కాక ఇతర సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్యం లాంటి ఇతర రంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న యెడల , ఇతర రంగాల ద్వారా పొందు ఆదాయం క్రిమీలేయర్ పరిగణనకు ఉండవలసిన ఆదాయాన్ని మించిన యెడల , అప్పుడే వారి పిల్లలు శ్రీమీలేయర్ గా పరిగణించబడతారు . 

5) వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార , వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుచున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి వర్తింపజేసి , క్రీమీలేయర్ క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి . 

   6 ) ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాల నుండి కూడా ఆదాయాన్ని పొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి క్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించాలి . అంతేకానీ , వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూపి క్రీమీలేయర్ స్టేటన్ ను నిర్ణయించరాదు .

   7 ) కొందరు Land Ceiling Act ప్రకారం వుండవలసిన భూమిలో 85 % కన్నా తక్కువ భూమి వున్నందువలన , ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా వున్నందువలన క్రీమీలేయరు క్రిందకు రాక పోయినప్పటికీ , వారికి పట్టణాలలో వున్న సంపదను బట్టి వారు క్రీమీలేయరు క్రిందకు వచ్చు అవకాశం కలదు . ఇది ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది . 

8 ) ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి మాత్రమే నిర్ణయించాలి . తన స్టేటస్ తో సంబంధం లేదు . అనగా ఎవరైనా గ్రూప్ -1 స్థాయి ఉద్యోగమునకు ఎంపిక కాబడి , మళ్ళీ గ్రూప్ -1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు గ్రూప్ -1 పరీక్షలకు గానీ , సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు , అతని స్టేటస్ ను బట్టి అతన్ని క్రీమీలేయర్ గా పరిగణించరాదు . అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి క్రీమీలేయర్ స్టేటస్ ని నిర్ణయించాలే గానీ , ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు . 

      ( 1 ) ఒక ఉద్యోగి తొలి నియామకపు స్టేటస్ 
( ii ) ఉన్న భూమి యొక్క పరిమాణం 
( iii ) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు ఆదాయ మరియు పట్టణాలలో ఉన్న ఆ ద్వారా వచ్చు ఆదాయం 
( iv ) సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించడం లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని , ఏ కేటగిరి క్రింద క్రీమీలేయర్ గా పరిగణించబడతారో స్పష్టంగా నిర్ణయించాలి . ఏ కేటగిరి క్రిందనూ క్రీమీలేయర్ పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్ క్రిందకు రారు . వేరువేరు కేటగిరీల క్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు . అలా కలిపి చూసి , క్రీమీలేయర్ స్టేటస్ ను నిర్ణయించరాదు .

Telangana BC welfare dept. Creamy layer Cr. No.E/424/2014, dt.28.07.2014 click here

Telangana Govt Backward Classes Welfare Department – Reservation for Other Backward
Classes -  Criteria to
determine the Creamy Layer -  Raising the annual income limit from
Rs.6.00 lakh to Rs.8.00 lakh – Orders  GO No.20, dt.31.10.2017 click here

No comments: